Sunday, 19 March 2017

Reliance Industries Chairman Mukesh Ambani



          విదేశాలకు తరలిపోయిన భారతీయ ప్రతిభావంతులను తిరిగి వెనక్కి తెప్పించేందుకు ఇదే సరైన సమయమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. దేశం కోసం భారతీయులు సేవ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ట్రంప్‌ రక్షణాత్మక ధోరణి భారత్‌కు కలిసివచ్చే అంశమేనని ముకేశ్‌ పేర్కొన్న కొన్ని రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత నెలలో వార్షిక నాస్‌కామ్‌ సదస్సులో ప్రసంగిస్తూ ‘కష్టాలను సైతం అవకాశాలుగా మలుచుకోవచ్చ’ని తెలిపిన విషయం తెలిసిందే. ‘మన దేశానికి చెందిన ఆణిముత్యాలు, అత్యుత్తమ నైపుణ్యం కలవారు దేశానికి, భారతీయులకు ప్రయోజనం కలిగే విధంగా పనిచేయాలి. వీరు తిరిగి రావడంలో నాకు ఎటువంటి సందేహం లేదు’ అని తెలిపారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ముకేశ్‌ మాట్లాడుతూ ‘ఎటువంటి కారణాల వల్ల వారు దేశానికి తిరిగి వచ్చినా.. 130 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు కొత్త అభివృద్ధి నమూనాను వీరు సృష్టించగలరు. కష్టాలను సైతం మంచి అవకాశాలుగా మలుచుకోవచ్చ’ని చెప్పారు. గతంలో విదేశాల్లో బహుళజాతి సంస్థలను ఒంటి చేత్తో నడిపిన ఎందరో ప్రతిభావంతుల్నీ నెలకో ఇద్దరు లేదా ముగ్గుర్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నియమించుకుంటోందని ముకేశ్‌ తెలిపారు. ‘మన తలుపులు తట్టే ప్రతిభావంతులకు కొదవ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేశానికి ఏదో ఒకటి చేయాలని భావించడమే ఇందుకు కారణమని అన్నారు.

అది మన అదృష్టం: బహిరంగ విపణితో పాటు టెక్నాలజీ అర్థం చేసుకునే నాయకుడు కలిగి ఉండటం భారత్‌ అదృష్టమని వెల్లడించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో మోదీ భేటీలో భాగంగా టెక్నాలజీ ఆవశ్యకత గురించి చర్చించిన విషయాన్ని ముకేశ్‌ గుర్తుచేశారు. ఇటీవలి పెద్ద నోట్ల రద్దుతో దేశం డిజిటలీకరణ దిశగా పరుగులు తీస్తుందని, నగదు ఆధారిత దేశం నుంచి అవసరమైన మొత్తం కలిగిన దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రస్తుతం 2 లక్షల కోట్ల బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్న జీడీపీని.. 40 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని అన్నారు. దేశంలో ఆచరణ చాలా పెద్ద సవాల్‌ అని, అయితే సాంకేతికత సాయంతో అధికారిక అడ్డంకులను అధిగమించొచ్చని అభిప్రాయపడ్డారు.
సమాచారాన్ని భద్రపరచండి: దేశీయంగా సృష్టించే సమాచారాన్ని దేశం దాటి పోనివ్వకూడదని, ఇందుకు ‘భారత్‌లో భద్రపరచండి’ (కీప్‌ ఇన్‌ ఇండియా) పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముకేశ్‌ అంబానీ అన్నారు. ‘మన సమాచారాన్ని ఇక్కడే భద్రపరచడం వల్ల ప్రతిభ, టెక్నాలజీ, కొత్త వినూత్నతలు, పెట్టుబడులు వంటివి దేశం నుంచి బయటకు వెళ్లవు. పెట్టుబడులు తిరిగి ఇక్కడికే తిరిగి వస్తాయి. డిజిటల్‌ ఇండియా, భారత్‌లో తయారీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లామో.. కీప్‌ ఇన్‌ ఇండియాను సైతం ప్రోత్సహించాలి’ అని వెల్లడించారు. కీప్‌ ఇన్‌ ఇండియాతో తప్పనిసరి మానవ వనరులను పెంపొందించుకోవడంతో పాటు సాంకేతిక రంగంలో అగ్రస్థానాన్ని వచ్చే కొన్ని తరాల పాటు నిలబెట్టుకోవచ్చని తెలిపారు. జాతీయ భద్రత, సౌర్వభౌమత్వ పరిస్థితులతో పాటు ఆర్థిక అంశాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని ముకేశ్‌ సూచించారు. డిజిటల్‌ యుగంలో డేటా, సమాచారం చాలా కీలకమైనవని, ఒకే సెకనులో ఇవి ఎటువంటి ఖర్చు లేకుండా ఖండాలు దాటిపోగలవని అన్నారు. డిసెంబరు నాటికి ఆర్‌ఐఎల్‌ టెలికాం విభాగం జియో 99 శాతం జనాభాకు చేరడమే లక్ష్యమని.. వచ్చే రెండేళ్లలో విద్యా సంస్థలను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగాల సృష్టి సవాల్‌గా అభివర్ణించిన ముకేశ్‌.. 58,000 కళాశాలలు, 19 లక్షల స్కూళ్లను జియో కలుపుతుందని చెప్పారు. 170 రోజుల్లో జియో 10 కోట్ల వినియోగదారులను చేర్చుకోవడంతో అమెరికా, చైనాలను తోసిరాజని ప్రపంచంలోనే అతిపెద్ద డేటా వినియోగించే దేశంగా భారత్‌ అవతరించిందని ముకేశ్‌ అన్నారు. వినియోగదారుల పరంగా వేగవంతమైన వృద్ధిని సాధించడంలో ఫేస్‌బుక్‌, స్కైప్‌లను జియో అధిగమించిందని వివరించారు.

No comments:

Post a Comment